Blog

ఫారిన్ టూర్‎కు ఏపీ జగన్, మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలుసా..?

నిన్న మొన్నటి వరకూ ఎన్నికల హడావుడితో బిజీబిజీగా గడిపారు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఇక కౌంటింగ్‌కి చాలా సమయం ఉండడంతో.. కుటుంబంతో సరదాగా గడిపేందుకు ఫారిన్‌ టూర్‌కి వెళ్తున్నారు. ఇవాళ సతీమణి వైఎస్‌ భారతీతో కలిసి తాడేపల్లి నివాసం నుంచి మొదట లండన్ వెళ్తారు. అక్కడి నుంచి కుమార్తెలతో కలిసి లండన్‌తో పాటు ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌‌కు వెళ్లే అవకాశం ఉంది సీఎం జగన్. దీంతో సీఎం జగన్ ఫ్యామిలీ మొత్తం జూన్ 1వ తేదీ వరకూ యూరప్‌ దేశాల్లో పర్యటించనున్నారు.

ఎన్నికల కౌంటింగ్‌కి మూడు రోజుల ముందు సీఎం జగన్‌ ఏపీకి తిరిగి వస్తారు. ఇప్పటికే సీఎం జగన్‌ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో ఫారిన్‌ టూర్‌కి వెళ్తున్నారు. అయితే సీఎం జగన్ తరఫు న్యాయవాదులు కూడా అందుకు కౌంటర్ చేశారు. జగన్ ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నారని, ప్రస్తుతం ఆయన రాజ్యంగబద్దమైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారని, ఆయనను నమ్ముకుని ఒక రాష్ట్రంతో పాటు పార్టీ నేతలు ఉన్నారని కోర్టుకు తెలిపింది. దీనిపై వాదనలు విన్న సీబీఐ న్యాయమూర్తి తీర్పును మే 14కు వాయిదా వేశారు.

తిరిగి ఈరోజు తీర్పు వెలువరించే క్రమంలో సీఎం వైఎస్ జగన్ కు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. చట్టంలోని రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ ప్రకారం బెయిల్ లో ఉన్న వ్యక్తికి అతని పరిస్థితులు, ప్రవర్తనను బట్టి విదేశాలకు వెళ్లేందుకు అవకాశం కల్పించవచ్చని తెలిపింది. దీంతో మే 17 నుంచి జూన్ 1 వరకు లండన్ వెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కుటుంబం‎తో కలిసి వెకేషన్‎కు విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్ కోరిన అనుమతిని మంజూరు చేసింది.

సీబీఐ కేసుల్లో బెయిల్ మీద ఉన్న సీఎం జగన్ ఇప్పటికే చాలా సార్లు ఇలా అనుమతి తీసుకుని లండన్, దావోస్ వెళ్లారు. గతంలో తన కుమార్తె పెద్ద చదువుల నిమిత్తం ఆమెను లండన్ లో విడిచిపెట్టి వచ్చేందుకు కూడా తోడుగా వెళ్లారు. ఇలా చాలా సార్లు సీఎం జగన్ విదేశాలకు వెళ్లి తిరిగి కోర్టు చెప్పిన గడువులోపు తిరిగి రావడంతో ఈ సారి కూడా విదేశాలకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కోర్టు. నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా తనకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ట్వీట్ కూడా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *