దేశంలో ఏడు దశల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సినీ తారలు మెరిశారు. ఇండస్ట్రీలో తమకంటూ మంచి పేరు సంపాదించిన పలువురు నటీనటులు ఈసారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మంగళవారం న వెలువడిన ఫలితాల్లో ఘన విజయం అందుకున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 293 సిట్లు మెజార్టీ సాధిస్తే.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని భారత కూటమికి 234 సీట్లు వచ్చాయి. ఈసారి ఎంపీ స్థానాలకు పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు.
అయితే కొందరు ఏళ్ల తరబడి రాజకీయాల్లో చక్రం తిప్పుతుంటే.. మరికొందరు కొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి గెలుపు బాట పట్టారు. అలా సినీ తారలు రాజకీయ రంగంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. తాజా లోక్సభ ఎన్నికల్లో వివిధ పార్టీలు వీరికి టికెట్లు ఇచ్చి తారల ప్రజాకర్షణ శక్తిని ఓట్లుగా మలుచుకునే ప్రయత్నం చేశాయి.
రామాయణ్లో రాముడిగా నటించి మన్ననలు పొందిన అరుణ్ గోవిల్ యూపీలోని మేరఠ్ నుంచి బీజేపీ తరఫున బరిలో దిగి గెలుపొందారు. మరోవైపు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (బీజేపీ) రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి మండి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. యూపీలో మథుర నుంచి హేమమాలిని (బీజేపీ) విజయం సాధించారు. యూపీలోని గోరఖ్పుర్ నుంచి నటుడు రవికిషన్ బీజేపీ తరఫున బరిలోకి దిగి విజయఢంకా మోగించారు.
టీఎంసీ అభ్యర్థి శత్రుఘ్న సిన్హా బెంగాల్లోని ఆసన్సోల్ నుంచి గెలుపొందారు. మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి నవనీత్ రాణా బీజేపీ తరఫున పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. బెంగాల్లోని హుగలీ నుంచి టీఎంసీ తరఫున రచనా బెనర్జీ గెలుపొందారు. తమిళనాడు విరుధునగర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన నటి రాధిక ఓడిపోయారు.