తల్లి మరణానంతరం ఆమె బంగారం కూతురికి చెందుతుందా? లేక కోడలికి చెందుతుందా? ఈ సందేహాన్ని చట్టం ప్రకారం, సాంప్రదాయం ప్రకారం.. అలానే మానవత్వ కోణం.. మూడు రకాలుగా చూడాల్సి వస్తుంది. మొదటగా చట్ట ప్రకారం చూసుకుంటే.. ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికీ తల్లి బంగారం చెందుతుంది. కొడుకులు, కూతుర్లు ఎంతమంది ఉంటే అంతమంది వారసులకూ ఆమె బంగారం మీద హక్కు ఉంటుంది. పొలం, స్థలం, ఇల్లు వంటి ఆస్తుల్లో సగం వాటా కొడుకుతో పాటు సమానంగా కూతురికి కూడా చెందుతుందని చట్టం చెబుతుంది.
అలానే బంగారం విషయంలో కూడా సగం వాటా కూతుర్లకు ఉంటుంది. అయితే సాంప్రదాయం ప్రకారం.. వృద్ధాప్యంలో తల్లికి సేవ చేసేది కొడుకు, కోడలు కాబట్టి అత్తగారి బంగారం ఆమె మరణించిన తరువాత కోడలుకు చెందుతుందని పెద్దలు చెబుతారు. అత్తగారిని బాగా చూసుకుంటేనే అత్తగారి బంగారం మీద కోడలుకి హక్కు ఉంటుంది. కూతురుకి ఎందుకు చెందదు అంటే.. కూతురికి డబ్బు, ఆస్తి, అలాగే బంగారం కట్నంగా ఇస్తారు. కాబట్టి తల్లి దగ్గర మిగిలిన బంగారం మరలా కూతురికీ ఇవ్వడం ఎందుకు అని పెద్దలు అంటుంటారు. కూతురికి కాకుండా కోడలికి ఇస్తేనే బాగుంటుందని చెబుతారు.
మరికొందరూ పెద్దలు అత్తగారితో కలిసి ఉండేది.. కోడలే కాబట్టి కోడలుకే చెందాలని చెబుతుంటారు. సాంప్రదాయం ప్రకారం.. కూతురు లేదా కోడలు ఇద్దరిలో ఎవరైనా సరే బంగారాన్ని ఎవ్వరూ తీసుకుంటే వారు కచ్చితంగా తల్లిని చూడటం ధర్మం. ఇక మానవత్వ కోణం ప్రకారం.. బంగారం, డబ్బు, ఆస్తులు ఏవి కూడా శాశ్వతం కాదు.. ఆర్థిక పరిస్థితి బాగున్నా.. బాగోలేకున్నా ఎలా ఉన్నా సరే అమ్మనే ముఖ్యం. ఆ అమ్మనే బంగారు గని అనుకుంటే కొడుకు గొప్పోడు అవుతాడు. అత్తగారు అయితే ఏమైంది.. తల్లి తరువాత తల్లే కదా అనుకుంటే ఆ అల్లుడు గొప్పోడు అవుతాడు.
మాకు బంగారం కంటే బంధాలే ముఖ్యం అని ఆడబిడ్డ అనుకుంటే ఆమెను మించిన అష్టలక్ష్మీ ఇంకెవ్వరూ ఉండరు. లక్ష్మీదేవి ఉన్న చోట గొడవలుండవు. మహాలక్ష్మీ అంటే మంచి మనస్సు. జన్మనిచ్చారు కాబట్టి పరిస్థితులు బాగున్నా.. బాగా లేకున్నా తల్లిదండ్రులను చూడటం అనేది ధర్మం. పిల్లలను సమానంగా చూడని తల్లిదండ్రులు అయినా.. సమానంగా ఆస్తి పంచని తల్లిదండ్రులు అయినా సరే జన్మనిచ్చిన బంధానికి ఏమి ఆశించకుండా వారి రుణం తీర్చుకోవడం ఉత్తముల లక్షణం. రుణ బంధాన్ని భారంగా కాకుండా.. బాధ్యతగా భావిస్తే కుటుంబ కలహాలుండవు. కల్మషం లేకుండా జీవిస్తే.. జీవితాలు బాగుంటాయి.